సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్


నిజామాబాద్, జూలై 06 (తెలంగాణ మేఘ టైమ్స్ ): వర్షాకాలంలో ప్రబలే సీజన్ వ్యాధులను నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం వైద్య ఆరోగ్యశాఖతో పాటు పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి వైద్యారోగ్య శాఖ కమిషనర్ కర్ణన్ సమీక్ష జరిపారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ, విషజ్వరాల పరిస్థితి గురించి ఆరా తీశారు. గడిచిన మూడేళ్ళుగా జిల్లాలో ఎలాంటి మలేరియా కేసులు నమోదు కాలేదని, అయితే పట్టణ ప్రాంతాలలో ఒకింత వేగంగా విస్తరిస్తున్న డెంగ్యూ వ్యాధిని నియంత్రించేందుకు క్షేత్రస్థాయిలో విస్తృత చర్యలు చేపట్టాలని  సూచించారు. వైద్యారోగ్య శాఖతో పాటు మున్సిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖలు కూడా పరస్పర సమన్వయంతో పని చేస్తూ, సీజనల్ వ్యాధుల నివారణకు అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరిస్తూ, అవగాహన కల్పించాలని సూచించారు. పారిశుధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, ఎక్కడైనా నీరు నిల్వ ఉన్నట్లు గమనిస్తే ఆయిల్ బాల్స్ వేయాలని, గంబూషియా చేప పిల్లలను వదలాలని, పిచికారీ మందు వేయించాలని, దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేయాలని అన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సీజనల్ వ్యాధుల నివారణకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచాలని, వ్యాధుల పరిస్థితిపై రోజువారీగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. డెంగ్యూ కేసు నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని, పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేయాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, అన్ని ఇండ్లు, సంస్థలలో చేపట్టి, నిలువ నీటినంతటిని బయట పారబోసి దోమలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి నివాస ప్రాంతాన్ని ఏ.ఎన్.ఎంలు, ఆశ వర్కర్లు సందర్శించాలని, ఇంటి లోపల, పరిసరాలలో నిలువ నీరు, చెత్త చెదారం లేకుండా చూసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. మున్సిపాలిటీలలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేస్తూ సీజనల్ వ్యాధులను నివారించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో జింక్ మాత్రలు, ఓ.ఆర్.ఎస్. అందుబాటులో ఉంచాలని అన్నారు. డెంగ్యూ తదితర సీజనల్ వ్యాధులకు సంబంధించిన వివరాలను ప్రైవేట్ ఆసుపత్రులు సైతం అందించేలా చూడాలన్నారు. 

         కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, మున్సిపల్, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖలు వైద్యారోగ్య శాఖతో సమన్వయము ఏర్పర్చుకుని, డెంగ్యూ, విషజ్వరాలు వంటివి ప్రబలకుండా ప్రణాళికాబద్ధంగా పని చేయాలని అన్నారు. వ్యాధులు ప్రబలకముందే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే, చాలా వరకు సీజనల్ వ్యాధులను నిరోధించవచ్చని సూచించారు. పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ అధికారులు, గ్రామాలలో ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి సమర్ధవంతంగా పని చేయాలని అన్నారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అదనపు సంచాలకులు అమర్ సింగ్, అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, డీఆర్డీఓ సాయాగౌడ్, డీపీఓ తరుణ్ కుమార్ చక్రవర్తి, మున్సిపల్ కమిషనర్లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.